వెనుతిరగని వెన్నెల(పూర్తి నవల) -డా||కె.గీత



భాగం-1

"యు హావ్ ఎరైవ్డ్ యువర్ డెస్టినేషన్"
సమీర జీ.పీ యస్ ని ఆపి,  కారు దిగింది. చుట్టూ పరికించి చూసింది.
"గ్రేట్ అమెరికా, జీ.పీ యస్లు లేకముందు అడ్రస్ లు అసలెలా కనుక్కునే వారో!" అని నిట్టూర్చి ఎదురుగా కనబడుతున్న ఇంటి నంబరు, “వాట్స్ అప్లో ఉదయిని పెట్టిన నంబరు ఒకటో కాదో సరి చూసుకుంది.
సిలికాన్ వేలీ లో చక్కని రెసిడెన్షియల్ ఏరియా అది. ఆపిల్, గూగుల్ ఆఫీసులన్నీ చుట్టూ పదిమైళ్ల పరిధిలోనే ఉంటాయి.
వీధిలో ఇళ్లన్నీ దాదాపు ఒక్కలాగే ఉన్నాయి. ఇళ్ల ముందు గార్డెన్ల సైజు తో సహా.
గేట్లు లేని చదునైన లాన్లు, బాట కిరుప్రక్కలా అందంగా విరిసిన గులాబీ మొక్కలు, అంతకు రెట్టింపు అందంతో  విరగ కాసిన పొట్టి పొట్టి నిమ్మ చెట్లు, నారింజ చెట్లు.  
"అయాం కమింగ్ హోమ్ లేట్ టు డే..." నడుస్తూ సాయి కి టెక్స్ట్  చేసింది.
"వేర్ ఆర్ యూ"  రిప్లై చూసి చిన్నగా నిట్టూర్చింది.
డోర్ బెల్లు కొట్టే ముందు అమెరికా మర్యాదని అనుసరించి ఉదయినికి కాల్ చేసింది.
అప్పుడు గమనించింది. డోర్ మేట్ మీద "సహాయ" అని కుట్టి ఉంది. ఇంటి ముందు వేళ్లాడదీసి ఉన్న గల గల మోగే చిన్న అద్దాలతో గుండ్రంగా తిరుగుతున్న విండ్ బెల్ మధ్య, బాట పక్కగా ఉన్న చిన్న గులక రాళ్ల మీద, తలుపుకిరుపక్కలా చిన్న దీపపు  కుందెల మీద అవే అక్షరాలు.
డోర్ పక్కగా ఉన్న అద్దాల వెనక నించి చిన్న అందమైన తెలుగు అక్షరాలు "సహాయ".
ఇలా సంస్థ  పేరునినేమ్ ప్లేట్గా వేళ్ళాడ దీయ కుండా అన్ని చోట్లా అందంగా అమర్చడం భలే బావుందేఅనుకుంది సమీర.
తలుపు తెరుస్తూనే ఉదయిని "సమీరా.....దా, దా... “అంటూ కౌగలించుకుంది. తల స్నానం చేసి విరబోసుకున్న జుట్టు నించి మంచి ఆహ్లాదమైన సువాసన వస్తూంది.
చక్కని పలువరసతో నవ్వు, కళ్ళ చుట్టూ చిన్న గీతల కాటుకతో మంచి మెరిసే కళ్లు.
బొట్టు చిన్నగా ఉన్నా, చామన ఛాయగా ఉన్న అందమైన ముఖమ్మీద సరిగ్గా అమరినట్టున్న చిన్నచుక్క. మాములు ఆడవాళ్ళ కంటే కొంచెం ఎత్తు అన్పిస్తూన్న హుందాతనం. అన్నిటి కంటే ఆశ్చర్యకరమైన విషయం చక్కగా పొందికగా ఆమెని అల్లుకున్న లేత చందనం రంగు చీర.
అమెరికా లో ఇంత మోడ్రన్ యుగంలో ఇలా చక్కగా చీర తో ఎదురయిన ఉదయినిని చూసి సమీరకి  తెలీని గౌరవమేదో కలిగింది. అంతకు మించిన ఆశ్చర్యమూ కలిగింది.
"మా అమ్మకు స్నేహితురాలంటే వేరేగా ఊహించుకున్నాను. మీరు నిజంగానే అమ్మ చెప్పినఉదయిని ఆంటీఅంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీ వయసు నలభై లోపే. యామై కరెక్ట్?" అంది సమీర పెద్ద కళ్ళు చేసి ఆశ్చర్యంగా.
"అవన్నీ సరేలే. అంతా చెప్పే మాటలే. అయినా నువ్విలా ఇలా గుమ్మం దగ్గిర నిలబడి, పరాయి అమ్మాయిలా ఫోన్ చెయ్యక్కరలేదు." అంది ఉదయిని సమీర చేతిలో బేగ్ అందుకుంటూ.
తెల్లని గోడంతా పెద్ద పెద్ద పూలతో అల్లుకు పోతున్నట్లున్న వరుస పసుపు, నారింజ పూల పెయింటింగులు.
అందుకు తగ్గ మేచింగ్ ఫర్నిచర్. మూల గాజు బీరువా లో "సితార". అరల నిండా చక్కగా పేర్చి ఉన్న పుస్తకాల ముందు  వరుసలోఅమృతం కురిసిన రాత్రి “.
"వావ్! యువర్ హోమ ఈజ్ సింపుల్ అండ్ నైస్ ... ఆంటీ" అని,
"నేను మిమ్మల్ని ఆంటీ అనొచ్చా?"  అంది సమీర.
"తప్పకుండా అనొచ్చు. మీ మమ్మీ , రాజీ  నాకంటే అయిదేళ్ళు సీనియర్. కానీ చాలా తమాషాగా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. వయసు మా మధ్య ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. మేమిద్దరం ఒకటే సంవత్సరం లో పుట్టకపోయినా ఒకటే తారీఖున పుట్టాం. అదొక కారణమనుకుంటా మా గాఢ స్నేహానికి." అని
"అవునూ, ఎలా ఉంది తను? ఎప్పటికప్పుడు ఫోను చెయ్యాలనుకుంటూనే కాలం గడిచిపోతూ ఉంది." అంది ఉదయిని.
"మీ కంటే అయిదేళ్లే పెద్దదైనా.... అమ్మమ్మ లా తయారైంది. ఒక హుషారు ఉండదు, ఏవీ  ఉండదు. అమ్మకు ఎప్పుడూ ఎదో ఒక బెంగే." అని నిట్టూర్చింది సమీర.
"మీరేమో ఇంత కళాత్మకంగా ఉన్నారు. అమ్మకు, మీకు అసలు స్నేహం ఎలా కలిసిందా అని ఆశ్చర్యంగా ఉంది." అంది మళ్లీ.
"స్నేహమనేది గొప్ప విచిత్రమైంది సమీరా ! ఎప్పుడు ఎవరు ఎవరికి పరిచయమవుతారో, ఎందుకు స్నేహమవుతారో! కొన్ని స్నేహాలు చాలా త్వరగా కుదురుతాయి. కొందరు పరిచయస్థులుగానే  మిగిలిపోతారు ఎప్పటికీ. స్నేహాలు ఎన్ని రోజులలో ఎంత త్వరగా కుదిరినా, మనతో ఎప్పటికీ వచ్చేవి అతి కొన్ని మాత్రమే. నాకు దొరికిన అతి కొద్దిమంది స్నేహితుల్లో రాజీ తో స్నేహం నేనెప్పటికీ మర్చిపోను. మా ఇద్దరికీ పరిచయం కూడా కాకతాళీయంగా జరిగింది.
హైస్కూల్లో మా డ్రిల్లు మాస్టారు  నన్ను పిలిచి "అమ్మాయ్, అదుగో సీనియర్ల బేచ్ లో కుంటాట ఆడడానికి ఒకమ్మాయి తక్కువైంది. నువ్వాడతావా? అనడిగేరు.
నన్నే ఎందుకడిగేరో నాకప్పుడు తెలీదు.
రోజూ సీనియర్లంతా ఆడుతున్నపుడు చకచకా తప్పించుకుని మెరికలా పరుగెత్తే అమ్మాయి వైపు నేను భలే ఆరాధనగా చూసేదాన్ని.
అమ్మాయే నన్ను రికమండ్ చేసిందని నాకు చానాళ్ళ తర్వాత తెలిసింది”.
నన్ను చెప్పనివ్వండి. మిమ్మల్ని రికమండ్ చేసింది అమ్మే కదూ" అంది సమీర.
'.. బానే చెప్పేసేవు.  కానీ నన్ను రికమండ్ చేసింది మీ అమ్మ కాదు, మీ అమ్మకు స్నేహితురాలు.
అయితే అమ్మాయికి  సరిగ్గా ఆడాల్సిన సమయంలో కాలు మెలి పడి దెబ్బ  తగిలింది.  రోజూ ఆరాధనగా వీళ్ల ప్రాక్టీసు సెషన్ దగ్గర హాజరయ్యే నన్ను గమనించి , డ్రిల్ మాస్టారికి  రికమండ్ చేసింది.
ఆటలో మా  బేచ్ గెలవగానే మీ అమ్మ ప్రశంసా పూర్వకంగా నన్ను దాదాపు ఎత్తుకుంది. అలా మొదలైంది మా స్నేహం". అని ఒక్క క్షణం ఆగి
అయినా మీ అమ్మకు కళాత్మకత లేదని ఎందుకు అనుకుంటున్నావు?”
" పుస్తకం చూడు" ఎదురుగా పుస్తకాల బీరువాలో ప్రత్యేకంగా ముందు వరుసలో పెట్టినగీతాంజలిని చూపించింది.
సమీరఇంత పాత పుస్తకాన్ని ఇంత జాగ్రత్తగా దాచారా?” అంది అందుకుంటూ.
మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలు.
"ప్రభూ! దయ అను అమ్మాయికి నన్ను స్నేహితురాలిని చేసావు. నీ దయతో నన్ను పునీతం చేసి నా "దయ" గా ప్రసాదించావు.  ఉదయ మధ్యాహ్న సాయంత్రాల్నిఉదయినిగా మార్చి నా జీవితాన్ని ఉదయింపజేసావు. ధన్య వాదాలు ప్రభూ! శతకోటి నమస్సులు!!"
-ఎప్పుడూ ప్రేమతో
నీ
రాజీ
"అమ్మ రాసిందా! ఇంత అద్భుతమైన వాక్యాలు!!" ఆలోచనలో పడింది సమీర.
పైకి అన్యాపదేశంగా "అమ్మలో ఇంత  భావుకత ఉందని తెలీదు నాకిప్పటివరకూ.  ఇప్పుడు అర్థమైంది, మీకు అమ్మ ఎందుకు స్నేహితురాలైందో." సాలోచనగా తలాడిస్తూ అంది సమీర.
నన్ను మీ అమ్మ "దయ" అని పిలిచేది. అప్పటికిచివరకు మిగిలేదిమేమిద్దరం కలిసి మూణ్ణాలుగు సార్లు చదివేసి, పుస్తకంలోని ప్రతీ పాత్రతో విపరీతమైన ప్రేమలో పడిపోయాం. నీకో గమ్మత్తు విషయం చెప్పనా!
నేను రాజీని  "రాజేశ్వరి" అని పూర్తి పేరుతో పిలిచినప్పుడు తన ముఖంలో విరిసే చిరు కోపం చూడాలి! తనకెందుకో అలా పూర్తి పేరుతో పిలవడం ఇష్టం ఉండేది కాదు. "మైదానం" తో ఏకీభవించకేమో.
అన్నట్లు రెండు పుస్తకాలు నువ్వు చదివేవా?!” అంది ఉదయిని.
లేదన్నట్లు తలాడించిమీరు చెప్తుంటే తప్పక చదవాలని అన్పిస్తూందిఅంటూ
"ఇదేవిటీ, ఎండిన మల్లెఫూల మాల! మధ్య పేజీలో" అంది జాగ్రత్తగా పేజీని తిరగేస్తూ సమీర.
దాదాపు ముట్టుకుంటే పొడై  రాలి పోయేట్లుంది.
"అది రాజీ నాకు పుస్తకంతో బాటూ ఇచ్చిన మల్లెపూల మాల.  వాళ్ల  పెరట్లోంచి గుప్పెడు మల్లెలు కోసి తీసుకు వచ్చి,  మాల కట్టి నా తలలో తురిమి ఎంత మురిసిపోయిందో చెప్పలేను. నా ముఖంలోకి చూసి మెటికలు విరిచి, నా బుగ్గ మీద ముద్దుపెట్టడం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది."
"వావ్ ఆంటీ, మీ ఇద్దరి స్నేహం చూస్తే అసూయగా ఉంది నాకు" అంది సమీర.
అలాంటి మీ అమ్మతో సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడడానికి కూడా స్నేహితురాలికి తీరిక లేదు చూసేవా? “అని నిట్టూర్చి
నీ పెళ్లికి కూడా రాలేక పోయాను. ఆరు నెలలయ్యిందా మీ పెళ్లయ్యి?" అంది ఉదయిని.
సమాధానంగా తలూపింది సమీర.
వస్తూనే మా సంగతులన్నీ చెప్పేసేను. నీ గురించి ఒక్క మాట కూడా చెప్పనివ్వలేదు. చెప్పుచెప్పు.. ఇక్కడ ఏం చేస్తున్నావు?”  అంది ఉదయిని.
సెమెస్టర్ తో ఎమ్మెస్ పూర్తి అయిపోతుంది ఆంటీ. ఇక  ఉద్యోగం  వెతుక్కోవాలి”. అని దీర్ఘంగా నిట్టూర్చింది.  
.. స్పెషలైజేషన్ ఏవిటీ, అంకుల్ మరో  కొత్త కంపెనీ లో చేరే ఆలోచనలో ఉన్నారు. ఓపెనింగ్స్ ఉంటే చెప్తాను”.  
అందుకు సమాధానం చెప్పి,“మీరెప్పుడొచ్చారు యూఎస్ కి? తెలుగు ఇంత బాగా, మర్చిపోకుండా మాట్లాడుతున్నారు? అంది సమీర అంతలోనే.  
మన మాతృ భాషని మనం మర్చి పోవడం ఏవిటీ? నిజానికి ఇతర దేశాల్లో ఎన్నేళ్ళున్నా ఎవరూ స్వంత భాషని మర్చిపోరు. కొందరు అదేదో నామోషీ  అనుకుని మాట్లాడరనుకుంటా. అన్నట్లు మేమెప్పుడొచ్చాం అనడిగావు కదా. దాదాపు పదేళ్లవుతూంది.”
మీ పాప ఇక్కడే పుట్టిందయితే
.. అవును, “సహాయఇక్కడే పుట్టింది.
, అమ్మాయి పేరేనన్నమాట మీ సంస్థకి కూడా.”
మీరుసహాయతో ఎంతో మంచి పని చేస్తున్నారాంటీ. రియల్లీ అప్రిషియేట్ యూ. ఇలా ఎవరైనా సహాయం చెయ్యక పోతే ఇంత దూరంలో, అమెరికా లో ఆడవాళ్లకి అనుకోని కష్టాలొస్తే ఎవరు ఆదుకుంటారు?” ప్రశంసా పూర్వకంగా అంది సమీర.
నీ గురించి చెప్పు సమీరా, అమెరికా నీకు నచ్చిందా?”
నచ్చడమంటే, ఇక్కడ అలవాటు పడితే ఇంత కంటే హాయి ఏముంది చెప్పండి. యాడెఫెనెట్లీ లైక్ దిస్  కంట్రీ   మరి మీకు?”
వచ్చిన కొత్తలో ఎప్పుడు  వెళ్ళిపోదామా అని ఉండేది. కానీ ప్రశాంత్ తన కెరీర్ ని ఇక్కడ ఎంచుకున్నాడు. అన్నిటికంటేకుటుంబమే ముఖ్యంఅన్నది నా భావన. ఇక నా ప్రపంచాన్ని ఇక్కడ నేనే సృష్టించుకున్నాను.”
భలే బావుంది, మీతో ఎంత సేపు మాట్లాడినా మాట్లాడాలని అనిపిస్తూంది. ప్రశాంత్ అంకుల్ ఎంతో అదృష్టవంతులు.” అంటూ
బొమ్మ ఎవరు వేసారు? మీ టేస్ట్ లో లేదు? అందిదగ్గరగా వెళ్లి సమీర.   
మా అబ్బాయి క్రాంతి. ఇప్పటి కాలపు చిత్రలేఖనం ఇలానే ఉంటుందంటాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ఉన్నాడు. బొమ్మలు వేయడం వాడి హాబీ. ”
మీ అమ్మాయి పాటలు పాడుతుందా? “ అంది సమీర.
అవును, అంత కరెక్టుగా ఎలా చెప్పావు?”
ఏం  లేదు, మీకున్న కళలు మీ పిల్లలిద్దరికీ చెరొకటీ వచ్చి ఉంటాయని ఊహించా”. అని నవ్వింది సమీర.
ఉదయిని సెల్ ఫోను మోగింది.
"ఒక్క నిమిషం సమీరా" అంటూ ఫోనందుకుంది ఉదయిని.
అంత వరకూ మమూలు గృహిణిలా ఉన్న తను హఠాత్తుగా ఒక ప్రొఫెషనలిస్టుగా మారిపోయింది.
అవతలి వాళ్లతో చక్కగా మంచి ఇంగ్లీషులో మాట్లాడుతూ మధ్య మధ్య నోట్ బుక్ లో చిన్నగా ఏదో నోట్ చేసుకుంటూ అపాయింట్మెంట్ వివరాలు చెబుతూంది.
తలూపుతూ  మధ్య మధ్య తన వైపు చూస్తూ చెదరని చిర్నవ్వుతో మాట్లాడుతున్న ఉదయిని వైపే చూస్తూ ఉండాలనిపించింది సమీరకు.
మరీ బావుండదనిపించి కుర్చీలోంచి లేచింది.
హాలునానుకుని కనిపిస్తూన్న  ఆవరణలో అందంగా పేర్చిన గుండ్రని రాళ్ళు, మధ్య పచ్చని లాన్, మధ్య  చిన్న జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం. జలపాతమ్మీదికి అల్లిబిల్లిగా వాలిన పూలతీగల పందిరొకటి.
"జీవితంలో తనకేది కావాలో, ఎలా కావాలో..  అవన్నీ సమకూరడం ఎంత అదృష్టం" అనుకుంది సమీర.
లాన్ కి అని వైపులా గులక రాళ్లమీద పేర్చిన "సహాయ"  అక్షరాలు.
"సహాయ" -ఎంత మంచి పేరు! “ అనుకుంది సమీర.
అమ్మ తనని పట్టుబట్టి ఇక్కడికి ఎందుకు పంపించిందో ఉదయిని ని, వాళ్ళ ఇంటిని చూసేక అర్థమైంది.
"సారీ సమీరా, చాలా సేపు పట్టింది" అంది ఉదయిని.
"అహాహా, అయాం ఒకే ఆంటీ, నేనే మీ వర్క్ సమయంలో వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నానా?" అంది సమీర.
"భలేదానివి, నిన్ను చూస్తే మీ అమ్మను చూసినట్టే  అనిపిస్తూంది. నువ్విలా రావడం నాకెంతో సంతోషంగా ఉంది తెలుసా?" అని
నీ కిష్టమైన స్వీటేవిటి చెప్పు చేసి పెడతాను. కొంపదీసి రాజీ లాగా "సేమ్యా పాయసం" అని మాత్రం అనకు. తనెప్పుడూ అదే చెప్పేది" అని గలగల నవ్వింది.
నవ్వినప్పుడు కొసల్లో కొంచెం పెద్దగా ఉన్న పన్ను నవ్వుకి మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.
అదే చెప్పింది ఉదయినితో.
మీ మమ్మీ నన్ను ప్రతీ నిమిషం పొగడమని పంపిందా ఏవిటి”. మరలా నవ్వింది.
గది గోడ పొడవునా ఉన్న అద్దాల లోంచి వెలుతురు కిరణాలు ఏటవాలుగా హాలులోకి పడ్తున్నాయి.
ఒక కొత్త ఉత్సాహమేదో ఆవరించినట్లయ్యి గలగలా కబుర్లు చెప్తోంది సమీర.
" పెయింటింగులు మీరు వేసినవే కదూ.....”
సితార నాకెంతో ఇష్టం, మీరు నాకొక సారి వినిపించరూ.....”
అబ్బా హాయిగా ఇలా ఎవరింటికైనా వచ్చి ఎన్నాళ్లయ్యిందో....."  గల గల మాట్లాడుతున్న సమీరని మందహాసంతో చూస్తూ
"మంచి కాఫీ తాగుతూ, అలా యార్డ్ లో కూచుందాం" పద అంది ఉదయిని.
"కాఫీ తాగడం మానేసానాంటీ "  అంది చిన్నగా పొట్ట తడుముకుంటూ సమీర అప్పటి దాకా ఉన్న హుషారు తగ్గిపోయి కొంచెం నిరసించిన గొంతుకతో.
ఏవిటీ, విశేషమా!” అంది దగ్గరగా వచ్చి ఉదయిని.
బదులుగా తలాడించి, "కాఫీ తాగడం ఇష్టంగా ఉండడం లేదీ మధ్య. అస్తమాటూ వామిటింగ్ సెన్సేష న్. మొదట రెండు నెలలు  బాగా ఎక్కువగా అనిపించింది. కానీ ఇప్పుడు కాస్త నయమేలెండి. నాలుగు నిండేయి కదా. డాక్టరు చెప్పింది ఇక తగ్గుతాయని."
"ఓకే, బూస్ట్ నీకు, కాఫీ నాకు." అని ఇంకా దిగులుగా ఉన్నట్లున్న సమీర దగ్గిరకి వచ్చి
"ఇలా చూడు సమీరా! సమయంలో ఇలా దిగులుగా ఉండ కూడదు. నీకేం కావాలో చెప్పు?" అంది ఉదయిని.
"నాకు విడాకులు కావాలి ఆంటీ" నెమ్మదిగా తలెత్తి, స్ఫుటంగా అంది సమీర.


*****
భాగం-2
        "ఏమైంది సమీరా?" అనునయంగా అడిగింది ఉదయిని దగ్గరికి వచ్చి.

"ఏం చెప్పమంటారు ఆంటీ, ఒక కారణం అంటూ చెప్పలేనన్ని ఉన్నాయి. నేనివేళ్టి ఆడపిల్లని. నేనేదీ సహించాల్సిన అవసరం నాకు లేదు. అన్నిటికీ అతను చెప్పిన మాటే వినాలంటాడు. అతని ఇష్టాఇష్టాలు నాకు ముందే తెలిసి ఉండడానికి అతను నాకు ఇంతకు ముందు పరిచయస్తుడు కాదు. అతని బాగోగులు నేను ఆలోచించడానికి అతను నాకు స్నేహితుడు కాడు, అతనేం చేసినా ప్రేమగా ఓర్చుకోవడానికి అతణ్ణి నేను ప్రేమించలేదు. ఇవన్నీ లేకుండా ‘అతను నీకు తాళి కట్టిన భర్త అనే చింతకాయ పచ్చడి డైలాగులు  చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు. " అని గబగబా అని
"సోరీ ఆంటీ, మీ సమయం అంతా తినేస్తున్నానా?" అంది సమీర.
"మళ్లీ మళ్లీ ‘మీ సమయం అంటూ వేరు పరచకు సమీరా! నీ జీవితం గురించి తెలియకుండా నేనెటువంటి సలహాలూ ఇచ్చి నిన్ను ఇబ్బంది పెట్టనులే, ముందీ పాలు పూర్తిగా తాగు...”
"ఆ.. అన్నట్లు నీకిష్టమని నేను దొండకాయ వేపుడు చేసి పెట్టేను." అంది ఉదయిని.
"దొండకాయ వేపుడు నాకిష్టమని మీకెలా తెల్సు?" ఆశ్చర్యంగా అంది  సమీర.
"అదేమరి, కనిపెట్టా" అని చిర్నవ్వు నవ్వింది.
"అబ్బా, మీ చెదరని చిర్నవ్వు నాకు కాస్త ప్రసాదించండి ఆంటీ, సమస్యలన్నీ గట్టెక్కేస్తాను." అంది సమీర.
"ఊ, అసలేమైంది?" సాలోచనగా అడుగుతున్న ఉదయిని వైపు చూసి,
"ఎక్కణ్ణించి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదాంటీ" అంది సమీర.
"అతను నీకు ముందు పరిచయం లేడన్నావు కదా" అంది ఉదయిని.
"ఊ.. ఈ పెళ్లి సంబంధం మొదలైందగ్గర్నుంచి చెప్తాను" అని వెనక్కు జారబడింది సమీర.
నాన్న మ్యారేజి బ్యూరో ద్వారా వీళ్ల పెళ్ళి సంబంధం తెల్సుకుని, ఫోటోలు పరస్పరం నచ్చాక
అతన్ని నేను మొదట స్కైప్ లో చూసేను. 
మేమిద్దరం యూ ఎస్ లోనే ఉన్నాం. అతను ఇల్లినాయిస్ లో. నేను టెక్సాస్ లో.
పది నిమిషాల స్కైప్ లో మేం మాట్లాడుకున్నది ఇద్దరి చదువుల గురించే. మీకు తెలుసు కదా, నేను బాగా ఏంబిషియస్.
అతను నన్ను రెండో ఎమ్మెస్ ఎందుకు చదువుతున్నావని అడిగేడు. 
నేను అతన్ని ఎమ్మెస్ ఎందుకు చెయ్యలేదని అడిగేను. అతను ఉద్యోగం బాధలేవో చెప్పేడు.
నేను మరో సెమిస్టర్ లో ఎమ్మెస్ పూర్తి కావాల్సి ఉంది, ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదని చెప్పేను.
అతను ఇంకా సెటిలవ్వడానికి సమ్యం తీసుకోదలచుకోవట్లేదని అన్నాడు.
ఇక మంచి సంబంధం ... అదీ ఇదీ అని మా ఇంట్లో ప్రెజర్సు.....
ఇలా కాదు గానీ మీకు మా పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి అంది సమీర.
***
"మీ నాన్న కి ఎంత గర్వం... నిన్ను పొగడడం తప్ప వేరే పనిలేనట్లుంది" అన్నాడు సాయి రిసెప్షన్లో స్టేజీ మీద  తమని ఆశీర్వదిస్తూ వస్తున్న వాళ్ల వైపు నవ్వుతూ చూస్తూ.
"మా నాన్న నన్ను పొగడుతున్నాడనా,  నిన్ను పొగడట్లేదనా?" చురక అంటించి తనూ ఎటో చూస్తూ నవ్వింది సమీర.
"చూడు బాబూ, సమీర మా ఒక్కగానొక్క కూతురు. అమ్మాయైనా అబ్బాయైనా తనే అన్నట్లు పెంచాం. తన చదువు కోసమే మేం ఈ సిటీ కి వచ్చాం. నాకున్న ఈ అపార్ట్ మెంట్లు, పొలాలు... మా యావదాస్తులూ తనవే. ఇవన్నీ నా కష్టార్జితాలు. మీరిద్దరూ ఇంతకు మూడింతలు సంపాదించి పిల్లా పాపల్తో హాయిగా ఉండాల్నేదే నా ఆకాంక్ష." అన్నాడు ధనుంజయ.
సమీర ఏదో అనేలోగా
పక్కనే కూచున్న సాయి, సమీరకు మాత్రమే వినిపించేలా "మీ నాన్నకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువే" అన్నాడు.
మొదటి  రాత్రి అంటూ అంతా చేసే హంగామా అసలు నచ్చలేదు సమీరకి.
"ఏవిటి, మాట్లాడితే ‘మీ నాన్న అంటూ..... ఒకటే లెక్చర్లు దంచుతున్నవు? మైండ్ యువర్ టంగ్"
సీరియస్ గా అంది దగ్గిరికి వచ్చిన సాయితో.
అతను ఇవేమీ వినిపించుకునే స్థితిలో లేనట్లు అడ్డదిడ్డంగా విజృంభించేసరికి అవాక్కైంది సమీర.
మర్నాడు భోజనాల దగ్గిర
"అత్తగారికి సహాయం చెయ్యాలని తెలీదా? వచ్చి టేబుల్ దగ్గిర కూచున్నావు?" అవహేళన నవ్వుతో  అన్నాడు సాయి.
"నాకు మీ ఇంటి సంగతి తెలియదు, మా ఇంట్లో నేనెప్పుడూ ఇలానే చేస్తాను" అంది ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ అందరికీ వినపడేలా.
"అమ్మాయికి పద్ధతులేవీ నేర్పించలేదు. మనమే అన్నీ నేర్పించుకోవాలి ఖర్మ" అని వెనకే వంటింట్లోంచి వినబడింది.
"అసలు వీళ్ల నాన్ననిన్నంతా ఏమేం గొప్పలు పోయేడో తెలుసా అమ్మా, మా అమ్మాయి చదువుల సరస్వతి, ఆమె ఎక్కడ అడుగు పెట్టినా కనకపు వర్షం  ... అదీ ఇదీ అని ఒకటే కూతుర్ని పొగడడమే ఎంత సేపూ... “ అంటూ వెనకే తందాన తాన అంటూ పెద్దగా చప్పుడూ చేస్తూ చికెన్ బోన్ ని పరపరా  నములుతూ అన్నాడు సాయి.
అలా శబ్దం చేస్తూ నమలడం చికాకు పుట్టించింది సమీరకి. అతని మాటలు అంతకంటే కంపరం పుట్టిస్తున్నాయి.
మరో గంట లో అక్కణ్ణించి బయటపడి ఒక ఉదుటున ఆటో ఎక్కి ఇంటికి వచ్చి పడింది సమీర.
" ఏవిటి సమీరా, అబ్బాయేడీ...." వెనక్కి చూస్తూ రాజీ అంటున్న మాటలు వినిపించుకుండా తన గదిలోకి విసవిసా నడిచింది సమీర.
నిక్కరు, టీషర్టు వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్న కూతురి దగ్గరకు వెళ్లి
"కొత్త పెళ్లి కూతురివి,  ఇంకా చుట్టాలు కూడా వెళ్లలేదు. చీర కట్టుకోమ్మా..." బతిమలాడుతూ వెనకే వచ్చింది రాజీ.
కొత్తగా  మాట్లాడుతున్న అమ్మని చూసి తల తిప్పుకుంది సమీర.
మరో గంట తర్వాత కూడా అలానే పడుకున్న సమీర దగ్గిరికి వచ్చి తల మీద చెయ్యి వేసింది రాజీ.
"అమ్మా,  డైనింగ్ టేబుల్ దగ్గిర వండినవన్నీ తెచ్చి పెట్టే బాధ్యత పెళ్లైన అమ్మాయిదా, వాళ్ళింట్లో వాళ్ళదా?" రాజీని  వాటేసుకుంటూ అడిగింది సమీర.
"ఈ డైనింగు టేబుల్ గురించెందుకు అంటూ... ఏదో అర్థమైనట్లు తల పంకించి .....లేమ్మా... ఇలా అన్నిటికీ మనింట్లో లాగా మారాం చెయ్యకూడదు. చూడు బయట హాల్లో  సాయి కూచున్నాడు." అంది రాజీ.
సాయి ఏం చెప్పాడో ఏమో , అప్పుడే బయటి నుంచి వచ్చిన ధనుంజయ లోపలికి  వచ్చి “ఏంటమ్మా, ఇలా చెప్పా పెట్టకుండా రావొచ్చా, అంతగా అయితే  నాకు ముందు కాల్ చెయ్యొచ్చుగా.” అన్నాడు.
తిరిగి వాళ్లింటికి వెళ్తున్నపుడు "ఇంకెప్పుడైనా ఇలా చెప్ప పెట్టకుండా మీ ఇంటికి వెళ్ళేవంటే ఇక నువ్వు జన్మలో మీ ఇంటి గడప తొక్కవు. మా ఇంట్లో ఈ విషయాన్ని సర్ది చెప్పుకునేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది." అన్నాడు సాయి.
ఆ మర్నాడు తిరుపతి ప్రయాణంలో “ఒక్క వారం ఓపిక పట్టు తల్లీ, అమెరికా వెళ్ళిపోతే ఇవన్నీ సర్దుకుంటాయి. పెళ్లయిన కొత్తలో ఇవన్నీ సహజం. అసలు దేనికి సమాధానం చెప్పకు.” అనునయంగా అంది రాజీ చెమ్మగిల్లిన కళ్ళతో.
ఇద్దరూ యూ. ఎస్ కి వస్తూనే "నాకు కాలిఫోర్నియాలో జాబ్ వచ్చింది. నువ్వు నీ లాస్ట్ సెమిస్టర్  ని అక్కడే ఏదైనా  యూనివర్శిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయినా నువ్వు  చదివి ఇప్పుడెవరిని ఉద్ధరించాలి? నా సిన్సియర్ ఎడ్వైజ్ ఏవిటంటే, ఇక నువ్వు చదువు మానేసి శుభ్రంగా పద్ధతులు నేర్చుకో.
వచ్చే నెల మా అమ్మ వస్తూంది ఎలాగూ.” అన్నాడు సాయి.
"సమీరా, ఇప్పటి వరకు నువ్వు మా అమ్మాయివి మాత్రమే, ఇప్పుడు నువ్వు మరో ఇంటి అమ్మాయివి కూడా, మొదట్లో అవతలి వాళ్ల పద్ధతులు మనకు కొత్తగా అనిపిస్తాయి. కొంచెం ఓపిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇంత చదువుకున్నదానివి. నీకు అతన్ని, అతని కుటుంబాన్ని చదివి చూడమని వేరేగా చెప్పాలా? నువ్వు అక్కడ  ఉదయినిని తప్పక కలువు......” అమ్మ మాటలు చెవిలో మార్మోగుతున్నాయి సమీరకి.
***
నిర్లిప్తంగా బయటి వెల్తుర్ని చూస్తూ  "మీ దగ్గిరకి రావడానికి కూడా నేను చాలా రోజులు తాత్సారం చేసేను ఆంటీ... ఆలోచిస్తూనే ఉన్నాను. విడాకుల కంటే వేరే మార్గం తోచడం లేదు. మీరు మా అమ్మకు స్నేహితులు.. మిమ్మల్ని చూసేక నాకు మీతో ఇవన్నీ చెప్పాలన్న స్నేహ భావన కలిగింది. అతని దగ్గిర నాకిలా మనసు విప్పి మాట్లాడాలనే భావనే కలుగ లేదు." అని నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ అంది సమీర.
"ఊ..... ఇప్పుడతని తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారా?” సాలోచనగా అంది ఉదయిని.
"లేరాంటీ, వాళ్ళు నెల కిందటే వచ్చారు. కానీ  డెలివరీ సమయమని ముందు ఈస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గిరికి వెళ్లేరు. అయినా అతనొక కీలుబొమ్మ. ఫోను లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తాయి.” అని నిట్టూర్చి
అమ్మ చెప్పినట్లు అతణ్ణి, అతని కుటుంబాన్ని చదివి చూడడానికి నేను ఈ ఆర్నెల్లు సమయం తీసుకున్నాను. కానీ ఎంత తరచి చూసినా ఇతనితో నా భావి జీవితం ఇంక ఇలాగే ఉండబోతుందన్న భయం పట్టుకుంది నన్ను. ఇంతలో ఈ పాపాయి....” అని పొట్ట తడుముకుని
తనని కూడా ఇలాంటి వ్యక్తుల మధ్య పెంచడం నాకిష్టం లేదు." దృఢంగా అంది సమీర.
వెలుగు నీడలు దోబూచులాడుతున్నఅద్దాల వైపు చూస్తూ  "జీవితాలు ఎంతో విచిత్రమైనవి సమీరా, అంత సులభంగా దేనినీ అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు మనకు అంతా అర్థమైనట్లున్నా నిర్ణయం తీసుకునే సమయానికి ఏవీ అర్థం కాదు.”  అని
మౌనంగా కూచున్న సమీర దగ్గరికి వచ్చి అనునయంగా భుజమ్మీద చెయ్యి వేసి,
నీకు ‘తన్మయి కథ చెప్తాను. నీ విధిని  నువ్వు నిర్వచించుకునే క్రమంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి
ఉపయోగపడ్తుందేమో అంది ఉదయిని.


*****
భాగం-3

ఉదయిని చెప్పిన తన్మయి కథ

"తెలివెన్నెల వేకువ లో తానమాడీ
అడవి దారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి.. కోన తిరిగి గుసగుసలాడి..
గల గల మువ్వల నవ్వుల నాట్యమాడీ..
తిరనాళ్లకు తరలొచ్చె కన్నెపిల్లలా
మెరుపులతో మెరిసిందీ వానకారూ
నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతీ
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ..."
రేడియోలో  శ్రీరంగం గోపాల రత్నం గారి గొంతు లో అలల్లా కదిలివస్తూంది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట.
మొదటి సారి ఓణీ వేసుకుని డాబా మీదికి పరుగెత్తింది తన్మయి.
ఉదయపు తొలి పొగ మంచు తెరల్లోని తెల్లదనం ఓణీ రంగులో కలిసిపోయి తనూ ఒక నీహారికై ఆకాశంలో నుంచి అప్పుడే ఉద్భవించినట్లనిపించింది తనకి. పొగ మంచులో ఎవరూ తనని చూడలేరన్న ధీమాతో రెండు చేతులూ
చాచి, ఆకాశం వైపుకి తల ఎత్తి గుండ్రంగా గింగిరాలు తిరిగింది. తనని జీవితమంతా పరవశం చుట్టుకుని ఉండాలన్నట్లు మురిసిపోయింది.
రోజు వాకిట్లో వంగి ముగ్గేస్తున్న తన్మయికి అద్భుత క్షణాలు మరలా గుర్తుకు వచ్చాయి.
 తెలి వెన్నెల వేకువలో...” లోపల్లోపల కూనిరాగం తీస్తూ ఈనెలు వేస్తూంది తన్మయంగా.
"అమ్మాయిగోరూ, బలేగా ఏసేస్తారమ్మా మీరు ముగ్గులు, నాకూ నేర్చించడమ్మా" అంది అటుగా వెళ్తూ చివరింటి పని మనిషి.
బదులుగా చిన్నగా నవ్వి, తీక్షణంగా సగం వేసిన ముగ్గు వైపు  చూస్తూ "నీకు నేర్పించడం మాట అటుంచు, నేనిక్కడ ఒక చుక్క మర్చిపోయినట్లున్నాను" అంది తన్మయి.
అంతలోనే "అయినా ఫర్వాలేదులే,  ఇవేళ చుక్కలతోనే కొత్త ముగ్గు కలుపుతాను చూడు" అని చకచకా కలపడం మొదలుపెట్టింది.
ఓణీ వేసుకున్న కొత్త రోజులేమో, అయిదు నిమిషాల కొకసారి పమిట సర్దుకుంటూ, సర్దుకునే సందట్లో ఒత్తైన జుట్టు వెనక నించి ముందుకు మాటిమాటికీ పడ్తూ, అలా పడే జుట్టుని ఎగదోసుకునే క్రమంలో చేతి వేళ్లకంటుకున్న ముగ్గు ముఖాన అంటుకుంటూ.... ముగ్గుల అవధానం చేస్తున్న తన్మయిని చూసి పకపకా నవ్వింది వనజ.
"వనా, అలా నవ్వక పోతే కాస్త జుట్టు గట్టిగా కట్టొచ్చుగాఅంది తన్మయి చిరు కోపం నటిస్తూ.
"ఏవిటి అమ్మాయిలకు ముగ్గులు తెమిలేయా, ఇంకా లేదా?"  బయటికి వస్తూ నవ్వుతూ అడిగింది తన్మయి తల్లి జ్యోతి.
"మన ఇంటి దగ్గిర అయిపోవచ్చిందమ్మా, వనజ వాళ్లింటి దగ్గిర ఇప్పుడెళ్ళి వేయాలి"  అంది తన్మయి కళ్ళు ఆర్పుతూ, వెలిగిస్తూ సంశయంగా పర్మిషన్ కోసమన్నట్లు.
"...నెలగంట పెట్టేక మీకిద్దరికీ ఇది అలవాటేగా, వెళ్ళి త్వరగా వచ్చేయి" అంది జ్యోతి.
"వనా, నువ్వు నాకంటే పెద్దదానివి కదా, ఇంకా నన్ను ముగ్గు పెట్టమని అడుగుతావేంటీ?" అంది తన్మయి పక్కన నడుస్తూ.
"ముగ్గులు బాగా పెట్టడానికి వయసుతో సంబంధంలేదు, అయినా నీలా అందంగా ఈను వెయ్యడం నాకు  రాదోయ్,  పైగా ఎక్కడైనా ఒక చుక్క తప్పిందంటే నీలా తెలివిగా ఆలోచించి ఏదో రకంగా ముగ్గుని సునాయాసంగా  కలపడం నాకు  రాదు  తల్లీ" అంది వనజ.
పక్కన హుషారుగా నడుస్తూన్న తన్మయి వైపు పరికించి చూసి "అన్నట్లు ఏమంటున్నాడు మీ  బావ" అంది మళ్లీ.
అంతలోనే ఎరుపెక్కిన బుగ్గలలో సిగ్గుని దాచుకుంటూ "అతనేదో దూరపు చుట్టం, బావేం కాదులే" అంది తన్మయి.
"అదేలే, ఎంత దూరపు చుట్టమైనా వరసకి బావేగా" అంది మళ్లీ కొంటెగా వనజ.
"చీపో.. వనా, నువ్వెప్పుడూ ఇంతే" అని,  ఊరికే ఉత్తరం రాసేడు అంది నెమ్మదిగా తన్మయి.
"..ఏవిటేమిటీ, ఉత్తరాల వరకూ వచ్చిందన్నమాట." అని గట్టిగా నవ్వింది వనజ
"ఉష్...ఎవరైనా వింటారు....అరవకు అంది" ఒక్క ఉదుటున వనజ దగ్గరకంటా వచ్చి నోరు మూస్తూ.
ఏం రాసేడు? ఏం రాసేడు?” అని ఉత్సుకతగా అడుగుతున్న వనజకిఅదేదో క్షేమ సమాచారాల ఉత్తరం. అంతే. అంతకు మించి విషయం ఏం లేదు.” అంది తన్మయి తడబడుతూ.
తన్మయి తడబాటు చూసిసర్లే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పుఅంది మళ్లీ  నవ్వుతూ వనజ.
రాత్రి అందరూ నిద్రపోయినా తన్మయికి నిద్ర పట్టలేదు.
లేచెళ్లి పుస్తకాల అరలో లెక్కల టెక్స్ట్ పుస్తకంలో దాచిన ఉత్తరాన్ని తీసి తెచ్చి, హాలులో జీరో బల్బు గుడ్డి వెల్తురులో చదవడం మొదలు పెట్టింది.
అక్షరాలన్నీ తప్పులే. తన పేరులో కూడా "" ఒత్తుకు బదులు "" ఒత్తు రాసేడు.
తన్మయికి అందమైన అతని ముఖం గుర్తుకు వచ్చింది. పాలుగారే తెలుపు రంగు, అందంగా కొసదేరిన ముక్కు, చక్కని ఉంగరాలు జుట్టు, పైన గొప్ప అందమైన ఎర్రని పెదవులు. అతన్ని చూసి ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా?
తన్మయి తన్మయత్వంలో తేలిపోతూ తమ పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.
***
"త్వరగా పడుకో పిల్లా, పొద్దున్నే ధవళేశ్వరం వెళ్లడానికి రెండు బస్సులు మారాలి" అంది నరసమ్మ.
చదువుతున్న "వెన్నెల్లో ఆడపిల్ల" పుస్తకం మూసి దిండు కింద పెట్టి, వెనక్కి తిరిగిమధ్యలో ఏంటి అమ్మమ్మాఅంది విసుగ్గా తన్మయి.
అసలీ ధవళేశ్వరం ఏవిటో, వాళ్ళెవరి పెళ్ళికో అమ్మమ్మ కూడా తను వెళ్లడవేమిటోఅనుకుంది లోపల్లోపల.
కొత్త ఊరు చూస్తున్నానన్న సంతోషం ఒక వైపు ఉన్నా, ఇలా కాలేజీ నుంచి వచ్చిన దగ్గర్నించి పడుకునే వరకు పుస్తకాలు  చదువుకోవడానికి వీలు పడదని విసుగ్గా ఉంది తన్మయికి.
త్వరగా పడుకో అంటున్నానుఅంది మళ్లీ నరసమ్మ.
"అలాగే అమ్మమ్మా, పొద్దున్న వేణ్నీళ్లు కాచేక లేపు, నీతో బాటూ లేపకు" అంది తన్మయి కళ్లుమూసుకుంటూ.
పొద్దున్న కళ్ళముందు ఇంకా చీకటి కనిపిస్తూండగా "అప్పుడే లేపేసేవా, వేణ్ణీళ్లు కాచేక...." అనబోతున్న తన్మయితో.
"వెళ్ళి పొయ్యి రాజెయ్యి, నేను కిరసనాయిలు తెస్తాను. అయినా రేపో మాపో పెళ్లి కాబోయే పిల్లవి పనులన్నీ నేర్చుకోవద్దూ. మొద్దు నిద్ర ఏవిటీ ...రాగం తీసివీధి వైపు గది గొళ్ళెం తీసింది నరసమ్మ.
శీతాకాలపు చల్లని వాకిట్లో రాత్రి మంచుకి తడిసి సగం,  అంతకు ముందు రోజు ఆర్పిన కట్టె పుల్లలు కావడం వల్ల ఆరని నీళ్ల వల్ల సగం కట్టె పుల్లలు అంటుకోవని రూఢి గా తెలిసిపోయింది తన్మయికి.
అయినా కొత్త కట్టెలు తెచ్చి పొయ్యిలో పెడితే ముసలామె సొమ్మేం పోయిందోఅని లోపల్లోపల గొణుగుతూ, కళ్ళు నులుముకుంటూ... తపేలాతో  నీళ్ళు తెచ్చి కట్టెల పొయ్యి మీద పెట్టి,  పొయ్యిలో బూడిదంతా బయటికి లాగి శుభ్రం చెయ్యడం మొదలు పెట్టింది.
"అయ్యో రాత, ముందు నీళ్లెట్టుకుంటారా పొయ్యి మీద?" అని రాగం తీసింది అప్పుడే వచ్చిన నరసమ్మ.
ముందురోజు కాలిన వైపే కట్టెల్ని ఒక దానికొసకొకటి నిలబడేట్లు పెట్టి, కిందొక కాగితం, కాస్త కొబ్బరి పొట్టు, లోపల కిరసనాయిల్లో ముంచిన చిన్న గుడ్డ పేలికతో గప్పున వెలిగించింది పొయ్యిని తన్మయి.
తెల్లారగట్ల నిద్రలేవడం కష్టంగా ఉంటుంది కానీ లేచాక ఎంతో బావుంటుంది కదా అమ్మమ్మా!” అంది తన్మయి
అరచేతులకు వేడి కాగుతూ.
ఎక్కడో ఒక చోట విన్పిస్తున్న కోడి కూత, రాత్రి విరిసిన చంద్రకాంత పూల పరిమళం, చుట్టూ ఇంకా చిక్కగా అలుముకున్న చీకటిని తానొక్కతే పారద్రోలగలదన్నట్లు గర్వంగా ఎగిసిపడుతున్న కట్టెల పొయ్యి సెగలు.
తెలీని తమకంతో బుగ్గలని రెండు వెచ్చని అరచేతుల మధ్య దాచుకుంది తన్మయి.
మనవరాలి వైపు ప్రేమగా చూస్తూ, పక్కనే వేడి కాగేందుకు పీట లాక్కుని కూచునినా బంగారు తల్లివి, నీకెలాటి మొగుడొస్తాడో" అంది మెటికలు విరిచి నరసమ్మ.
సాయంత్రం ధవళేశ్వరం పెళ్లిలో అటూ ఇటూ తిరుగుతున్న ఎవరో కుర్రాడు తన వైపే చాలా సార్లు చూస్తున్నట్లనిపించింది హఠాత్తుగా తన్మయికి.
చుట్టూ పరికించి చూసింది. అతను కనిపించలేదు.  అంతా తన భ్రాంతి అని నవ్వుకుంది.
శ్రద్ధగా పెళ్లి తంతు చూస్తూ "జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారు అమ్మమ్మా" అని అమ్మమ్మ చెవిలో అరిచింది ఒక పక్క గట్టిగా మంగళ వాయిద్యాలు మోగుతూండగా.
"నీకూ తెలుస్తాదిలే త్వరలోఅంది నవ్వుతూ నరసమ్మ.
సిగ్గుతో తల వంచుకుని అంతలోనే అప్రయత్నంగా  పెళ్ళి కొడుకు తరఫు వాళ్ల బంధువుల వైపు చూసింది తన్మయి.
తన వైపే ఎప్పటి నుంచో చూస్తున్న అతను చప్పున కళ్ళని తిప్పుకోవడం గమనించింది.
"ఎవరితను ఇంత అందంగా ఉన్నాడు!" అనుకోకుండా ఉండలేకపోయింది. బహుశా: ఇరవై ఏళ్లుంటాయేమో.
అమ్మమ్మని అడగడానికి భయం వేసింది.
అయినా అతను తనని కాకుండా వెనక ఇంకెవరినైనా చూస్తున్నాడేమో, అనిపించి వెనుతిరిగి చూసింది మళ్లీ. వెనకంతా పెద్ద వాళ్ళే ఉన్నారు, తన ఈడు వాళ్ళెవరూ లేరు.
అతను తన వైపే చూస్తున్నాడని రూఢయ్యేసరికి అప్రయత్నంగా తన్మయి ముఖంలో నవ్వు విరిసింది.
భోజనాల దగ్గిర అమ్మమ్మ దగ్గిరికి వచ్చి "నాన్నమ్మ గారూ, నన్ను గుర్తు పట్టేరా, శేఖర్ నండి" అన్నాడు కూరలు  వడ్డిస్తూ.
పలకరింపంతా తనకోసమే అని తన్మయికి అర్థమవుతూనే ఉంది.
"...దేవి కొడుకువా. గుర్తు పట్టలేదబ్బాయ్, ఎప్పుడో సిన్నపుడు సూసేను" అని నరసమ్మ
"ఆయ్.. ధవళేశ్వరం లోనే సెటిలయ్యేవండీ.... " అంటూ అతను ఏదో మాట్లాడుతున్నాడన్నమాటే గానీ ఒక్కటీ బుర్రకెక్కడం లేదు తన్మయికి.
దించిన కళ్ళతో నెమ్మదిగా తింటున్న తన్మయిని చూపిస్తూ "మా జ్యోతి కూతురు, ఇంటర్ సదువుతాంది" అంది గొప్పగా చెప్పి
"కాళేజీ సదువుతున్నావా" అనడిగింది నరసమ్మ.
"లేదండి టెంత్ తర్వాత మానేసి వ్యాపారం చూసుకోమన్నారు నాన్నగారు" అన్నాడు.
కొంచెం బాధ వేసింది తన్మయికి. “అయ్యో, చదువు మానేసాడా! అయినా... తనకెందుకులేఅని అనుకుంది మళ్లీ.
ఇంటికి వచ్చిన వారం తర్వాత, పోస్ట్ మేన్ ఇంటి గుమ్మం లోకి విసిరిన ఉత్తరాలలో తన పేరు తో ఉత్తరం ఉండడం తో ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుంది తన్మయి. అటూ ఇటూ చూసి ఉత్తరం తీసుకుని డాబా మీదికి పరుగెత్తింది. దడదడా కొట్టుకుంటున్న గుండెతో ఇన్లాండ్ ఉత్తరాన్ని చింపింది. త్వరగా చింపడం వల్ల అంచులతో బాటు ఉత్తరం చివర కూడా కాస్త చిరిగిపోయింది.
కవరు మీద ఇంగ్లీషులో ఉన్న చక్కని దస్తూరీకి, లోపలి కొక్కిరి బిక్కిరి తెలుగు రాతకు సంబంధం లేదు. అయినా అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు తన్మయి.
ప్రియమైన తన్మయికి,
ఇక్కడ నేను బాగున్నాను. అక్కడ నువ్వు బాగున్నావని తలుస్తాను.
నీకు ఇలా ఉత్తరం రాయడం తప్పయితే క్షమించు. నువ్వు నాకు నచ్చావు.
నీకు నేను నచ్చితే ఉత్తరం రాయి. ఇది నా ఫ్రెండు షాపు అడ్రసు.  ఇక్కడికి ఉత్తరం వేయగలవు.
ఇట్లు
నీ బావ
శేఖర్"
అతి మామూలు ఉత్తరం లో  "నువ్వు నాకు నచ్చావు",  చాలా గొప్ప వాక్యంలా తోచింది తన్మయికి. ఇక- “ప్రియమైన”,”నీ బావపదాల సంగతి చెప్పనే అక్కరలేదు. పదే పదే అవే గుర్తుకొస్తున్నాయి.
అద్దంలో చూసుకుంటూ, “నేను అతనికి ఎందుకు నచ్చి ఉంటాను?” అని సాలోచనగా అనుకుంది.
బక్క పలచని శరీరం, పల్చని చెంపలు, ఒక మోస్తరు రంగని కూడా చెప్పలేని ఒంటి రంగు. కాటుక కళ్ళు చలాకీగా ఉంటాయి. జుట్టు బావుంటుంది. కానీ అతని ముందు తనేమీ అందగత్తె కాదు. అది స్పష్టం.” అనుకుంది మళ్లీ తన్మయి.
***
 పేర్లు కూడా సరిగా రాయడం రాదంటే టెంత్ పాసవ్వలేదన్నమాటఅంది ఉత్తరం మడిచి వనజ.
..అనుకుంటాఅంది తన్మయి.
అంతే కాదు, గమనించేవా? ఉత్తరం మీద అడ్రసు అతను రాసినది కాదు.”
.. సర్లే వనా, అతని రాత బాలేదని ఫ్రెండుతో రాయించి ఉంటాడు.” అని ఆలోచనలో పడ్డ తన్మయి మనస్సు చదివినట్లు
అతనికి నువ్వెందుకు నచ్చి ఉంటావో అన్న ఆలోచన మానెయ్యి, అయినా నీకేం తక్కువ. అంత:సౌందర్యం మెండుగా ఉన్న దానివి. తెలివిగలదానివి. అతను నీకెందుకు నచ్చాడో చెప్పు.” అని
అన్నట్లు రిప్లై ఇస్తున్నావా?” అంది వనజ.

*****
భాగం-4
సాయంత్రపు వెలుగు క్రమంగా మాయమవుతూ ఉంది. పక్షులు గూళ్ళకి చేరుతూ కిలకిలారావాలు చేస్తున్నాయి.
డాబా పైకి పాకిన సన్నజాజి తీగె,  దానినల్లుకుని ఉన్న రాధాకృష్ణ తీగె పగలా రాత్రా అన్నట్లు పోటీ పడి విరబూసి ఉన్నాయి.
తన్మయి సన్నజాజి మొగ్గలు బుట్టలోకి కోసి వేస్తూ నిట్టూర్చింది.
పక్కనే ఉన్న వనజఊరికే అదే పనిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు తనూ! శేఖర్ నిజంగానే నిన్ను ఇష్ట పడుతున్నాడేమో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్అని కొంటెగా నవ్వింది.
తన్మయిఉహూ! నేనాలోచిస్తున్నది అది కాదు, అతను చదువుని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదన్నది నాకింకా అర్థం కావడం లేదు. బహుశా ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల బాధ్యతలు అడ్డు వచ్చాయంటావా?” అంది.
నువ్వింకా అతని ఉత్తరం లో తప్పుల్ని నేను ఎత్తి చూపానని బాధ పడ్తున్నట్టున్నావ్, నా ఉద్దేశ్యం అది కాదుఅంది వనజ.
సన్నజాజులు కోయడం పూర్తి చేసి దారపు రీలు లోంచి ఒక పెద్ద ముక్క నోటితో కొరికి వనజ చేతికిచ్చింది. మాల కట్టడానికి వీలుగా రెండు రెండు పూలని వనజకి అందిస్తూ, వీధి చివర దుమ్ము రేపుకుంటూ వస్తున్న రెండెడ్ల బండిని, వెనుకే వస్తున్న మేకల మందని చూస్తూమనకంటే పశు పక్ష్యాదులు నయం. వాటికి బాధలూ లేవు కదూ! అంది తన్మయి.
పూలు అల్లి,  మొదటి మాలని తన్మయి తలలో తురుముతూమనకీ బాధలూ లేవుఅని నవ్వింది వనజ.
***
వారం రోజులనించీ ఆలోచిస్తూనే ఉంది తన్మయి. శేఖర్ కి బదులివాలా, వద్దా అని. "ఇక సాయంత్రం కాలేజీ నించి రాగానే మొదలుపెట్టాలి"  అనుకుంది.
మామూలుగానే తలకి బాగా కొబ్బరి నూనె పెట్టి, బిగించి రెండు జళ్లు వేసింది జ్యోతి తన్మయికి.
రెడీ మేడ్ పంజాబీ డ్రెస్సులు అలా వీధిలోకి వస్తే మధ్య రెండు ముదురు రంగులు కొంది జ్యోతి.  ఎప్పుడూ టైలరు దగ్గర కుట్టించిన పరికిణీలు  వేసుకునే తన్మయికి డ్రెస్సులు బాగా నచ్చాయి.  అందులో ఎరుపు రంగు డ్రెస్సు తీసి వేసుకుందా రోజు తన్మయి.
కాలేజీ  లోపలికి వెళ్ళబోతూ గేటు దగ్గిర  పరిచయమైన ముఖం చూసి ఆశ్చర్యపోయింది. భయంతో పుస్తకాల్ని గుండెలకు ఇంకాస్త దగ్గరకు అదుముకుని అతన్ని పలకరించకుండానే లోపలికి వెళ్లిపోయింది.
క్లాసు రూముకి వెళ్లి పుస్తకాలలో తల దూర్చింది కానీ, ఏవీ వినిపిస్తున్నట్లు లేదు.
"అతను ఇక్కడికి ఎందుకు వచ్చేడు? ఉత్తరం రాయలేదని ఏకంగా వెతుక్కుంటూ వచ్చేసేడా? ఇదంతా ఇప్పుడు ఇంట్లో తెలిస్తే,  అమ్మో! ఇంకేమైనా ఉందా? ముందెళ్లి అతన్ని ఇక మీదట ఇలా రావొద్దని చెప్పెయ్యాలి. అలా చెప్తే అతను బాధ పడ్తాడేమో." అని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తూంది.
"అతనికి నచ్చినా, నచ్చక పోయినా ఇదొక పెద్ద గొడవ కాక ముందే,  తనకి ఇలాంటివి నచ్చవని ఖరాఖండీగా చెప్పెయ్యాలి " అని నిశ్చయించుకుని క్లాసు మధ్యలో పర్మిషన్ అడిగి కాలేజీ బయటికి వచ్చింది తన్మయి.
తను ఊహించినట్లుగానే ఇంకా అక్కడే ఉన్నాడు అయితే సారి ఎదురుగా బడ్డీ కొట్టు బెంచీ మీద కూచుని, గేటు వైపే చూస్తూ కనిపించాడు.
తను బయటికి రావడం చూసి నడిచి ఎదురుగా వచ్చాడు.
చాలా మామూలుగా నవ్వుతూ "బావున్నావా?" అన్నాడు.
తన్మయి గొంతు పెగల్చుకునే లోగా  " చుట్టుపక్కల ఊళ్లలో  అమ్మే కోళ్ల దాణా  కొనడానికి తరచు నాన్నగారు వస్తుంటారు.  ఇప్పుడా డ్యూటీ నేను తీసుకున్నాను. ఎలాగూ వచ్చేను కదా, ఒక సారి నిన్ను చూసెళ్దామని వచ్చేను.  అని "వస్తానూ.." అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయేడు.
తన్మయికి మనస్సు స్థిమిత పడింది. సమస్య తననుకున్నంత కాంప్లెక్సు కానందుకు.
"అతనన్నీ డైరక్టుగా చెప్తున్నాడు. మొన్న నిన్ను ఇష్ట పడ్డానని ఉత్తరం రాసేడు, ఇవేళ ఏకంగా నిన్ను చూడడానికి వచ్చేడు. మరి రేపేవిటో..."అంది కనుబొమలు ఎగరేస్తూ వనజ.
" బిగించిన కొబ్బరి నూనె జడలు, లూజు పంజాబీ డ్రెస్సు చూసి ఇక మళ్లీ రాడులే" అంది తన్మయి.
పైకి అలా అందే కానీ, అతను మరలా వస్తే బావుణ్నని అనుకుంది.
సాయంత్రమే ఉత్తరం రాసి పోస్టు చేసింది.
"ప్రియమైన శక్కూ!
ఉభయకుశలోపరి.
తెలి వెన్నెల వేకువలో నీ ఉత్తరాన్ని వందో సారి చదివేను. "నువ్వు నాకు నచ్చేవు" అన్న నీ అక్షరాలు నా మనస్సులో శాశ్వతంగా ముద్రపడిపోయేయి.
నా ఇష్టాలేవిటో చెప్పనా! మంచు ఉదయాన గాలికి తలలూపే గరిక పూలంటేనూ, ప్రతి పువ్వులోనూ ప్రపంచపు అందమంతా అల్లుకున్న దేవగన్నేరు పూలంటేనూ ఇష్టం. గులాబీ పూల రేకుల మీద ముత్యపు చినుకుల్లా నిలిచిన నీహారికలంటే మరీ మరీ ఇష్టం.  అన్నిటినీ మించి శీతాకాలపు నును వెచ్చదనంలో లేత ఊదా రంగులో పొదలన్నీ నిండే డిసెంబరం పూలంటే ఇష్టం.
నువ్వెంత అదృష్టవంతుడివి! ఇంచక్కా పరవళ్లు తొక్కే గోదావరి సమక్షాన ఉన్నవు. నాకే గనుక అలాంటి అవకాశం ఉంటే గుండె ఘోషలన్నీ  రోజూ గోదారమ్మతో కలబోసుకోనూ!  అన్నట్లు నేను నిన్ను "శక్కూ" అని పిలవడం నీకు నచ్చకపోతే చెప్పు. నాకిలా ముద్దు పేర్లతో పిలవడం అంటే ఇష్టం.
అవునూ! హఠాత్తుగా  అలా ప్రత్యక్షమయ్యే సరికి భయపడిపోయేను తెలుసా! మళ్లీ నిన్ను చూసేదెన్నడో అని మనసు ఘోషిస్తూంది, కానీ ప్రపంచపు భయం నన్ను వెనక్కు తగ్గమంటూంది. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. క్షమిస్తావు కదూ!
మరో ఉత్తరంలో మరిన్ని-
నీ
తను(ఇది నా  ముద్దు పేరు!)
ఉత్తరం పోస్టు చేసిన దగ్గర్నించీ అట్నించి వచ్చే ఉత్తరం కోసం ఎదురుతెన్నులు చూడడంతోనే సరిపోతూంది తన్మయికి. ఎందుకైనా మంచిదని ఉత్తరానికి మరో కాపీ రాసి దగ్గర పెట్టుకుంది. ఉత్తరానికి సమాధానం వచ్చినపుడు రెండూ దగ్గిర పెట్టుకుని చదువుకోవడం ఎంత బావుంటుంది!
ఉత్తరం వస్తే బావుణ్ణన్న సంతోషం ఒక పక్క నించీ, తీరా ఉత్తరం వచ్చేక  ఎవరి కంటనైనా పడ్తుందేమోనన్న ఆదుర్దా ఒక పక్క నించీ నిలవనీయడం లేదు తన్మయిని.
ఒక పక్క చదువుమీద నించి దృష్టి పక్కకి వెళ్లిపోకూడదని మనసుని తమాయించుకుంటూన్నా తన వల్ల కావడం లేదసలు.
మొత్తానికి మరో పదిహేను రోజుల్లో ఎదురు చూస్తున్న ఉత్తరం రానే వచ్చింది.
కాలేజీ నించి ఇంటికి వచ్చి ముఖం కడుక్కూంటూండగా నరసమ్మ ఉత్తరం తెచ్చి రహస్యంగా ఇచ్చింది తన్మయికి.
తన్మయి ఆశ్చర్యంగా అమ్మమ్మ వైపు చూసి అంతలోనే అటు వస్తూన్న తల్లికి కనబడకుండా దాచింది.
ఉత్తరం పట్టుకుని లోపలికి పరుగెత్తుతున్న తన్మయిని చూసి ముసిముసిగా నవ్వుకుంది నరసమ్మ.
తడబడే వేళ్లతో ఉత్తరం చింపిన తన్మయికి రెండే రెండు వాక్యాలు కనిపించి హుషారంతా పోయింది.
"నీ ఉత్తరం నాకు సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు.
ముఖ్య విషయం నేను వచ్చేవారం మళ్ళీ మీ ఊరొస్తున్నాను.
సారి ఇంటికే వస్తాను."
ఇదా ఎంత గానో ఎదురు చూసిన ఉత్తరం. అసలే విషయానికీ బదులు లేదు.
సాయంత్రం  శేఖర్ రాసిన ఉత్తరం, వనజ తన ఉత్తరం కాపీ మార్చి మార్చి చూసినువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా. నక్కకూ, నాగ లోకానికీ ఉన్నంత తేడాగా ఉన్నాయి మీ ఇద్దరి ఉత్తరాలు.” అని నవ్వుతూ
అతనికి నువ్వు రాసిన ఉత్తరం అర్థం కాకపోవడంలో నాకైతే ఏవీ ఆశ్చర్యం లేదుఅంది మళ్లీ.
"అంటే ఏవిటి? అతను నాకు సరిజోడు కాదనా నీ ఉద్దేశ్యం?” అంది ఉక్రోషంగా తన్మయి.
"అలా కోపగించుకోకుండా ఉంటే నేనింకో మాట చెబుతాను. అతనిని నువ్వు ఇష్ట పడడం లో తప్పు లేదు. కానీ అతనికీ నీ హృదయం ఉంటుందని ఊహించుకోవడం లోనే తప్పు ఉంది" అంది వనజ సాలోచనగా.
అవన్నీ సరేలే ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. అతను మళ్లీ వస్తానంటున్నాడు, పైగా ఇంటికి. అతని ఉద్దేశ్యం ఏవిటో నాకు  అర్థం కావడం లేదు.” అని తల పట్టుకుంది తన్మయి.
"సర్లే రానివ్వు. అతనికీ అర్థం కావాలిగా మీ ఇంటి పద్ధతులు. అయినా చుట్టాలబ్బాయి కదా వస్తే ఏమనుకోరని ధైర్యమనుకుంటా"  అంది వనజ.
***
శేఖర్ వస్తానన్న రోజు తెల్లారిందగ్గర్నించీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది తన్మయికి.
కాలేజీ లో ఉదయం నించీ ఏవీ తలకెక్కడం లేదు.
మధ్యాహ్నం నించి తలనొప్పిగా ఉందని పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఎప్పుడూ చలాకీగా ఉండే తన్మయి ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండడమే కాకుండా ముసుగు పెట్టి పడుకోవడం చూసి జ్యోతి వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది.
మనస్సులో చెలరేగుతున్న ఘర్షణకి తలపోటు నిజంగా రావడం మొదలైంది  తన్మయికి. 
వాకిట్లో అలికిడి అయినా  అతనొచ్చాడేమో అని చెవులు రిక్కించి వింటూ ఉంది.
సాయంత్రం బయటి నించి వస్తూనే తన్మయి తండ్రి భానుమూర్తి "జ్యోతీ, అబ్బాయి వచ్చాడు చూడు" అనడం విని చప్పున మంచం దూకి బాత్రూం లోకి పరుగెత్తింది తన్మయి.
ముందు గదికి ఆనుకుని ఉన్న హాలులోకి వచ్చేసరికి తండ్రితో మాట్లాడుతూ తన వైపే చూస్తున్న శేఖర్ ని చూడగానే చప్పున తలుపు చాటున దాక్కుంది.
నరసమ్మ ఏదో అర్థమైన దానిలా పక్కకు వచ్చినీకోసమే వచ్చినట్లున్నాడుఅంది ముసి ముసిగా నవ్వుతూ.
అతనికి సరిగ్గా కనిపించేటట్లు నిలబడి ఓర కంట చూసింది తన్మయి. అతను ఇంకా ఇటే చూస్తున్నాడు.
జ్యోతి టీ పట్టుకొచ్చి హాలులో తచ్చాడుతున్న తన్మయిని చూసినువ్వు పట్టుకెళ్తావాఅని అడిగింది.
లోపల్లోపల పొంగుతున్న సంతోషంతో తలూపి, ట్రే పట్టుకెళ్లింది తన్మయి.
ఇది మా అమ్మాయిభానుమూర్తి శేఖర్ కి పరిచయం చేసేడు.
బదులుగా తలూపిమొన్న పెళ్లిలో చూసేనండి  అన్నాడు.
ఒక్క మాటా మాట్లాడే అవకాశం రాలేదు తన్మయికి.
వ్యాపారం పని మీద ఊరు వచ్చేనని అతను చెప్తూన్నా ఇంటిలో ఎవరికీ నమ్మాలనిపించడం లేదన్న సంగతి గ్రహించింది తన్మయి.
మరో గంటలో అతను వెళ్లిపోగానే జ్యోతి  సీరియస్ గా లోపలికి వచ్చి "అతనెందుకు వచ్చాడు?" అంది తన్మయితో.
బిత్తరపోయి సమాధానం లేనట్లు నేల చూపులు చూసింది తన్మయి. గొంతులో కూతురి ప్రమేయం లేకుండా పరాయి అబ్బాయి హఠాత్తుగా ఎందుకు వస్తాడనే గదమాయింపు ధ్వనిస్తూంది.
తన్మయికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
ఇంతలో నరసమ్మ వంటింట్లో  నించి వచ్చిఅదేవిటి, కుర్రాడేవైనా పరాయి వాడా? మన దేవి కొడుకేగా. మొన్న పెళ్లి లో కనిపించినపుడు ఇటొస్తే వస్తూండమని నేనే చెప్పేనుఅంది.
. మనవరాలిని వెనకేసు రావడం కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు బాగా చదవమని చెప్పు" అని తన్మయి వైపు విసురుగా చూసి వెళ్లిపోయింది జ్యోతి.
తన్మయికి తను చేసిన తప్పేవిటో అర్థం కాలేదు. అలాగని అమ్మా, నాన్నలతో విడమర్చి మాట్లాడే ధైర్యమూ, అవకాశమూ లేదు. 
అమ్మమ్మ నయమే బానే తప్పించబోయింది కానీ తనతో పరాయి అబ్బాయి గురించి చర్చించే ధైర్యం లేదు.
వనజ దగ్గరకు వెళ్లి గోడు వెళ్ళబోసుకుంది తన్మయి.
"...మీ ఇంట్లో అంత పోజిటివ్ గా రియాక్టవుతున్నట్లు లేరు. నువ్వు ఉత్తరాలు రాస్తున్నావని తెలిస్తే ఇంకాస్త మండి పడతారు. ముందు అతన్ని ఇలా వచ్చి కనబడొద్దని ఉత్తరం రాయి" అంది వనజ.
"మీ ఇంట్లో నుంచి ధవళేశ్వరం,  వాళ్ళ ఫ్రెండు షాపు కి ఫోను చేస్తేనో" అంది సాలోచనగా తన్మయి.
"అమ్మో, ఎస్.టీ.డీ కాల్ చేసేవంటే ఇంట్లో బిల్లు రాగానే చంపేస్తారు. పోనీ టెలీగ్రాము ఇవ్వు." అంది వనజ.
టెలీగ్రాము పుచ్చుకుని ఏమనుకున్నాడో ఏమో మళ్లీ అటు నించి ఎటు వంటి రెస్పాన్సు లేదు రెండు నెలల వరకు.
తన్మయి కాస్త స్థిమితపడింది. కానీ అతని గురించిన ఆలోచనలు వదలడం లేదు.
ఇంటర్మీడియేట్ పరీక్షలు అయిన వేసవిలో తన్మయి వనజ దగ్గరికి వెళ్లి, ఇంటికి వచ్చేసరికి ఇంట్లో హడావిడి కనిపించింది.
 *****
భాగం-5

వనజ ఇంటి నుంచి తన్మయి వస్తూనే జ్యోతి 'త్వరగా రా చీర కడతాను. కాస్సేపట్లో  పెళ్ళి చూపులకి వస్తున్నారు" అంది.
ఆశ్చర్యపోయింది తన్మయి.
"తనకి పెళ్లి చూపులా?"
కానీ పైకి ఎవరూ, ఏవిటని అని అడిగే ధైర్యం కూడా లేదు తన్మయికి.
జడగంటలు వేస్తూ "అబ్బాయి కాకినాడ లో ఆర్. ఎం. పీ  డాక్టరు.  ప్రాక్టీసు బావుంటుందంట,  బాగా సంపాదించి మధ్యే సొంతిల్లు కట్టుకున్నాడట. బాబాయి వాళ్లు చెప్పేరు  అని
"కాస్త నవ్వుతూ మాట్లాడు ఏవైనా అడిగితేఅంది జ్యోతి కూతురితో.
తన్మయికి మతి పోతూంది. “ఇలా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా పెళ్లి చూపులంటున్నారేవిటి? ఒక పక్క శేఖర్ వైపు తన మనస్సు ముడిపడిపోతూంది. ఇప్పుడిక్కడ పెళ్లి చూపుల్లో అవతలి వాళ్లకి తను నచ్చితే? తను ఒకరిని ఇష్టపడుతూ మరొకరికి భార్య కాగలదా?”
భాను మూర్తి లోపలికి  వచ్చి వాళ్లొస్తున్నారని  చెప్పేక గుండె దడ ఎక్కువైంది తన్మయికి.
అన్యమనస్కంగా ఇంత సేపూ ఎలా తయారు చేస్తే అలా ముస్తాబు చేయించుకుంది. అద్దంలో తనను చూసుకుంది. పీలగా ఉన్న శరీరానికి చీర కడితే కొయ్య బొమ్మకు కట్టినట్టు అనిపించింది.  పెట్టుకున్న నగలు తన కంటే బాగా మెరుస్తున్నాయి.  చుట్టుపక్కల తెల్సిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి జ్యోతికి వంటింట్లో సాయం చేస్తున్నారు.
పక్కింటి అత్తయ్య వచ్చి కనకాంబరం మాల తలలో తురిమి చెంపలు నిమిరి మెటికలు విరిచింది.

తన్మయికి శేఖర్ తన చుట్టూ పరిభ్రమిస్తూ మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఏవిటిదంతా? అని తనని నిలదీసి అడుగుతున్నట్లనిపించింది.
"తనొక్కదానికీ ఆలోచించి బుర్ర పగిలిపోతూంది. వనజతో విషయం చెప్పే వాళ్లుంటే బావుణ్ణు." అంటూ పెదవి కొరుక్కుంటూ అలానే కూచుండి పోయింది.
అతను తల్లితో కలిసి వచ్చినట్లున్నాడు. కానీ అతనే అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నాడు. 
తనని గదిలోకి తీసుకెళ్లి నిలబెట్టింది జ్యోతి. పక్క వాళ్లతో మాట్లాడుతూ తనవైపో సారి చూసి  చూపు తిప్పుకున్నాడు.
తలెత్తి చూసిన తన్మయికి ఎందుకో నిర్వేదం వచ్చింది.
ఒక మోస్తరు కళగా కూడా లేని ముఖం.  అతని వయస్సు 25 పైన ఉండొచ్చు. తన్మయికి  తెలీని బాధగా అనిపించింది.
ఎప్పుడు తనని అక్కడి నించి పంపేస్తారా అన్నట్లు తల్లి వైపు చూసింది.
మిగతా వాళ్లెవ్వరూ తనని పట్టించుకోనట్లు అతని వైపే చూస్తున్నారు. పెళ్లి చూపులంటూ పెద్ద తతంగం జరలేదు.  సరిగ్గా 5 నిమిషాలు అతనెదురుగా నిలబడి పేరేమిటో చెప్పి, వచ్చేసిందంతే.
నరసమ్మ మనవరాలిని లోపలికి తీసుకెళ్లింది.
మనవరాలి కళ్లలో దిగులు అర్థం చేసుకున్నా ఏవీ చేయలేని అసహాయతతో తల నిమిరి వెళ్లిపోయింది.
***
  సాయంత్రం దిగులుగా కూచున్న మనవరాలి దగ్గరకి వచ్చి " రొండు లచ్చలు కట్నవడిగేరు. మీ అమ్మా, నాన్నా వొద్దని చెప్పేరు" అంది.
తన్మయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అప్రయత్నంగా అమ్మమ్మని కౌగలించుకుంది.
ఒక్క ఉదుటున డాబా మీదికి పరుగెత్తింది. చీకట్లో మెరుస్తున్న నక్షత్రాల్ని చూస్తూ రెండు చేతులూ జోడించి గుండెలకి అదుముకుని "థాంక్యూ..థాంక్యూ" అంది.
ఏదో ఒక గొప్ప రిలీఫ్ గా, గుండెల మీద బరువు తీరినట్లు హాయిగా అనిపించి గిరగిరా తిరిగింది.
కిందికి వచ్చి, మెట్ల పక్కనే  పొద మీద  మెరుస్తూ విరిసిన చిట్టి  చంద్రకాంత పూవునొకదాన్ని చేతులోకి తీసుకుని లేత పరిమళాన్ని దీర్ఘంగా పీల్చి, మెత్తని రేకుల్ని అపురూపంగా తడిమి, మురిపెంగా తలలో తురుముకుంది.
తర్వాతి వారంలో శేఖర్ నించి మరొక ఉత్తరం వచ్చింది.
ఊర్లో ఏదో పెళ్లికి తల్లితో బాటూ వస్తున్నాడట, ఆదివారం ఇంటికి వస్తామని రాసేడు.
తన్మయి అతను వచ్చే సమయానికి ఇంట్లో లేకుండా వనజ దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
అదే పెళ్ళికి తనూ వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదు.
అలా అనుకుందే కానీ పెళ్లిలోశేఖర్ కనిపిస్తూనే తన్మయికి తెలీని సంతోషం ముంచుకు వచ్చింది. అతని తల్లి దేవి తనని పరికించి చూడడం గమనించింది.
"ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడు దేవి అత్తయ్యతో" నరసమ్మ మనవరాలి చెయ్యి పట్టుకుని ముందుకు లాగింది.
బిడియంగా "నమస్తే" అని చెప్పింది.
పరిచయంగా దగ్గిరికి తీసుకుని "ఇలా రామ్మా, నువ్వేనా తన్మయివి" అని, "మా శేఖర్ చెప్పేడులే" అంది నవ్వుతూ దేవి.
"ఏం చెప్పేడన్నట్లు" కుతూహలంగా దేవి వైపు తిరిగి,  దూరంగా తన వైపే చూస్తున్న శేఖర్ వైపు కొంటె చూపు విసిరింది తన్మయి.
దూరం నించి నవ్వుతూ కన్ను గీటేడు శేఖర్.
అతన్ని, తనని ఎవరైనా చూసేరేమో అని భయంగా తల దించుకుంది.
"ఏవిటిదంతా సిగ్గే" అంది మళ్లీ దేవి.
మధ్యాహ్నం భోజనాలు కాగానే బయలుదేరుతూ "మాతో రండి మా ఇల్లు చూద్దురు గాని"  అంది జ్యోతి తల్లి పోరు పడలేక.
ఇంట్లో మధ్య గదిలో పైన గోడ బల్లల  మీద బోర్లించి ఉన్నఇత్తడి సామాన్ల వైపు దృష్టి వాల్చకుండా  చూసింది దేవి.
"ఇవన్నీ మా అమ్మ నాకు ఇచ్చినవే. ఇవన్నీ మా తన్మయికి ఇచ్చేస్తాం" అంది నవ్వుతూ జ్యోతి.
దేవి ప్రశంసా పూర్వకంగా చూస్తూ "అయినా ఒక్కతే అమ్మాయి కదా, మీకంటే ఎక్కువగానే ముట్టచెప్పాలి మీ అమ్మాయికి మీరు." అని
అవే కదా "ఒదిన గారూ, పిల్లలకి పుట్టింటి ధైర్యాలు" అని సర్దింది.
పెద్దవాళ్ళు సామాన్ల గోలలో ఉండగా తన్మయికి శేఖర్ తో మాట్లాడే అవకాశం వచ్చింది.
పెరటి సందులో ఎదురెదుగా గోడలకి జేరబడి నిల్చున్నారు.
"ఏవిటీ, ఉత్తరాలు రాయడం లేదు" అన్నాడు.
 "ఇంట్లో గొడవవుతుందేమోనని" అని నసిగింది కిందికి చూస్తూ తన్మయి.
"అమ్మకి చెప్పేను. నాకు నచ్చినట్లే తనకీ నువ్వు నచ్చితే మంచిది కదా" అని పెదవి బిగబట్టి చూసాడు తన్మయి వైపు.
అతనలా పెదవి బిగబట్టి కొంటెగా చూస్తే మరింత అందంగా ఉంటాడు.
"...ఇంకేవిటి  విశేషాలు?" అన్నాడు.
"బోల్డు ఉన్నాయి. నాకు నీతో కలిసి వెన్నెట్లో గోదారి మీద విహారానికి వెళ్లాలని ఉంది. తీసుకెళ్తావా" అంది.
"గోదారి మీద రాత్రి పూట పడవలు తిరగవనుకుంటా, పగలెళ్లొచ్చుకదా, చీకట్లో పడి గోదారెంట తిరగడమెందుకు?" అన్నాడు.
"చీకట్లో కాదు, వెన్నెట్లో...అని సరి చేసింది ఉక్రోషంగా తన్మయి.
"అదేలే..ఏదో ఒకటి" అని,  "సరిగా తినవా ఇలా బక్క చిక్కి ఉంటావు?" అన్నాడు తేరిపార చూస్తూ.
తన్మయికి ఇంకాస్త ఉక్రోషం పెరిగింది.
అయినా తమాయించుకుని "నేనెంత తిన్నా ఇంతే" అనేదో చెప్పబోతూండగా
అకస్మాత్తుగా పరిచయంగా ముందుకి ఒకడుగు వేసి చప్పున బుగ్గని తట్టి"ఇక బయలుదేరుతాం మళ్లీ వొస్తానులేఅన్నాడు.
బుగ్గ మీది అతని అరచేతిని అలానే పట్టుకుని ఉండిపోవాలన్న తమకం కలిగింది తన్మయికి. ఒక్క సారిగా ఒళ్ళంతా పులకరింతతో వొణికింది.
 శేఖర్ వైపు దిగులుగా చూస్తూ "అప్పుడేనా" అంది గొంతు పెగల్చుకుని.
"చాలా పనుందమ్మాయ్, నాన్న గారితో సాయంత్రం మరో పని మీద  వెళ్లాలి నేను" అన్నాడు చాలా కాజువల్ గా.
 బైటి  నుంచి అప్పుడే వస్తూన్న తండ్రి గొంతు వినిపించేసరికి ఒక్క ఉదుటున లోపలికి పరుగెత్తింది తన్మయి.
***
తన్మయికి ఇంటర్మీడియేట్ లో చేరినప్పట్నించీ కాలేజీ లెక్చరరు కావడమంటే ఇష్టం పట్టుకుంది. అంతకు ముందు వరకూ తను పెద్దయ్యి ఏం కావాలో తనకి ఎటువంటి ఆలోచనా ఉండేది కాదు.
ఇంగ్లీషులో ధారాళంగా పాఠాలు చెప్తూ పిల్లలందరినీ ఆకట్టుకునే కృష్ణారావు  మాస్టారంటే  విపరీతమైన గౌరవం తన్మయికి.
మాస్టారు ఇంగ్లీషులో పీ.హెచ్.డీ  చేసేరని విని తనెప్పుడు పీ.హెచ్.డీ చేస్తుందో అనుకుంది. బిడియంగా మాస్టారి దగ్గరకెళ్లి ధైర్యం చేసి అడిగింది ఒక రోజు.
లెక్చరరు కావాలన్న తన్మయి ఆలోచనకి ఎంకరేజింగ్ గా చూస్తూ "జూనియర్ కాలేజీ లెక్చరరు కావాలంటే పీ.హెచ్.డీ చెయ్యనవసరం లేదు. తత్సంబంధిత సబ్జెక్టులో ఎమ్మే చేస్తే చాలు. అయితే ఎంట్రన్సు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుకు ఎమ్మేలో  మినిమం సెకండ్ క్లాసు మార్కులు వచ్చినా సరిపోతుంది.  నీకు తెలీనిదేవుంది. ఇది కాంపిటీషను కాలం.  మంచి మార్కులు ఎప్పుడూ అవసరమే. ఇక పీ.హెచ్.డీ చేస్తే డాక్టరు అనిపించుకోవడమే కాదు. డిగ్రీ కాలేజీ లెక్చరరు పరీక్ష రాయడానికీ, యూనివర్శిటీలలో లెక్చరరు ఉద్యోగాల అర్హత పరీక్షలకూ పనికి వస్తుంది." అని సాలోచనగా
ఇంటర్మీడియేట్ లోనే ఇవన్నీ తెలుసుకోవడం అనవసరమే అనుకో. కానీ ముందు ముందు ఏం చెయ్యాలనుకుంటున్నామో
అదే విధంగా జీవితంలో స్థిర పడడానికి డిగ్రీలో నువ్వు తీసుకునే సబ్జెక్టుల మీద ఆధారపడి ఉండడం వల్ల తెలుసుకోవడం మంచిది." అని
"నువ్వు తప్పక లెక్చరరువవుతావు ఒక రోజు,  ఇలా బిడియంగా మాట్లాడడం మానేస్తే" నవ్వారు మాస్టారు.
అవేళ్టి నుంచి ఇంగ్లీషు బాగా చదవడం మొదలు పెట్టింది తన్మయి. దానితో సమానంగా తెలుగు సాహిత్యం పట్లా ఇష్టం మొదలైంది. ఎందుకో రెండు భాషల పట్లా తీరని మక్కువ మొదలైంది. నిజానికి కాలేజీలో లెక్కల సబ్జెక్టులో తనకి ఎప్పుడూ ఎక్కువ మార్కులొస్తాయి. కానీ సాహిత్యంలో ఉన్నదేదో లెక్కల్లో లేనట్లు అనిపించసాగింది క్రమంగా తన్మయికి.
వేసవి సెలవులు కాగానే తన ఇష్టానికి సరిపడగానే డిగ్రీ కాలేజీ లో చేరి ఇంగ్లీషు లిటరేచరు తో చదవాలనుకుంది తన్మయి.
"అసలే రోజులు బాగా లేవు, అమ్మాయి కోసం అసలే కుర్రాడు తిరుగుతున్నాడు. హాస్టలులో పెట్టడం నాకిష్టం లేదు. మీరే ఏదో రకంగా సర్దిచెప్పండి అమ్మాయికి." అంది జ్యోతి.
"ఊర్లో డిగ్రీ కాలేజీ లేదు, నిన్ను హాస్టల్ లో  పెట్టి చదివించడం మాకు ఇష్టం లేదు. ప్రైవేటుగా బియ్యే చేసుకోమ్మా. కావాలంటే ట్యూషను పెట్టించుకో" అన్నాడు భానుమూర్తి తన్మయితో.   
"ప్రైవేటుగా ఇంట్లో కూచుని ఇంగ్లీషు లిటరేచరు  చదవాలంటే కష్టమే, ఇదో నాలా డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తెలుగు లిటరేచర్ చదువు పోనీ, నీకెలాగూ తెలుగు సాహిత్యమంటే ఇష్టమేగా" అంది వనజ సాయంత్రం.
"నిజమే వనా, కానీ తెలుగు లిటరేచరుతో పాలిటిక్సు, ఎకనామిక్సు గ్రూపు తప్పని సరిగా చదవాలనుకుంటా. నాకేమో హిస్టరీ లాంటి సబ్జెక్టులైతే బావుణ్ణని ఉంది." అంది తన్మయి.
"హేయ్, ఇది చూసేవా తెలుగు లిటరేచరు, ఇంగ్లీషు లిటరేచరు, హిస్టరీ" నీ పంట పండింది పో. నువ్వనుకున్న సబ్జెక్టులతో ఆంధ్రా యూనువర్శిటీ నీ కోసమే ప్రెవేటు డిగ్రీ ఆఫర్ చేస్తూంది." అంది వనజ కోర్సుల బ్రోచరుని చూపిస్తూ.
తన్మయి సంతోషంగా కిందికి పరుగెత్తింది.
***
తన్మయి బియ్యే మొదటి సంవత్సరంలో వుండగా అడపా దడపా సంబంధాలని ఎవరో అనడం, వాళ్లు ఇంటి వరకూ రావకపోవడం జరుగుతూనే ఉంది.
జ్యోతికి, భానుమూర్తికి అమ్మాయి పెళ్లి తొందర లేకపోయినా బంధువుల ఒత్తిడి, తన ఈడు వాళ్లందరికీ పెళ్లిళ్లు మొదలవడంతో వీళ్లకూ తొందర పట్టుకుంది.
ఇంతలో ముచ్చటగా మూడోసారి  సాయంత్రం శేఖర్ ఇంటికి వచ్చేడు.
భానుమూర్తి ఇంట్లో లేడు.
ఏదో మామూలుగా, చుట్టపు చూపుగా వచ్చానని అతనంటున్నా ఇంట్లో వాళ్లకి అనుమానం మరింత బలపడేలా అతని చూపులు చెప్తున్నాయి.
"తన్మయిని చూడడానికే  వచ్చానండీ" అన్నాడు ఉన్నట్టుండి ధైర్యంగా జ్యోతితో. 
 జ్యోతి కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి, "పెళ్లి కావలిసిన పిల్ల,  నువ్విలా అమ్మాయి కోసం వస్తూ ఉంటే ఏం బావుంటుంది?" అంది ఇక రానవసరం లేదన్నట్లు కొంచెం గట్టిగా.
"అదే చెప్పడానికి వచ్చానత్తమ్మా, మీకు ఇష్టమైతే తన్మయిని నేను పెళ్లి చేసుకుంటాను." అన్నాడు శేఖర్.
లోపలి నుంచి చెవులొగ్గి వింటున్న తన్మయికి ఒక్క సారిగా గాలిలో గంతులేయాలనిపించింది.
నరసమ్మ మాట వింటూనే "ఇది పద్ధతి కాదు బాబూ, పెద్ద వాళ్లు వచ్చి అడగాలీ..." అంది లోపల్లోపల సంతోషపడుతూ.
"అలాగేనండి, మా పెద్ద వాళ్లని తీసుకుని వస్తాను" అన్నాడు.
"అబ్బాయీ వాళ్లు మన బంధువులే గానీ, మనకు వీళ్ళ విషయాలు సరిగా తెలీదు. ఏం చేద్దామంటారు? అంది జ్యోతి భానుమూర్తితో రాత్రికి విషయం మాట్లాడుతూ.
"అబ్బాయి మన అమ్మాయిని ఇష్టపడుతున్నట్లున్నాడు. మనమ్మాయికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు భానుమూర్తి.
***
"పెళ్లి మాటలు మాట్లాడడానికి వాళ్ల పెద్దల్ని తీసుకు వస్తానన్నాడు. ఎంత ధైర్యంగా అడిగేసాడో తెలుసా?!" అంది సంతోషంగా తన్మయి వనజతో.
"ఇవన్నీ కాదు, నీకేమో పీ.హెచ్.డీ చేయాలనుందన్నావు, మరి ఇప్పుడీ పెళ్లి మాటలేవిటో" అంది వనజ నవ్వుతూ.
"అవన్నీ అతన్ని అడుగుతాను. ‘’పెళ్ళాయ్యాక చదువుకోనిస్తానంటేనే పెళ్లి అని ఖరాఖండీగా చెప్పేస్తాను." అంది తన్మయి. అందే గానీ అతను కాదంటే చేసేదేమీ లేదని కూడా తెలుసు తనకు. అయినా అతను తన మాట తీసెయ్యడని నమ్మకం.
"అయినా అతనంత ధైర్యంగా అడగడం ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఎదురుగా వెళ్లి అతనితో నేనొప్పుకుంటున్నానని గంతులేస్తూ చెప్పాలనిపించింది." అంది మళ్లీ ఇంకా మురిసి పోతూ.
"..అంతా బానే ఉంది. కానీ అతనేం చేస్తున్నట్లు? ప్రేమించడానికి వివరాలు అవసరం లేకపోయినా, పెళ్లంటే ఇవన్నీ ఆలోచించాలేమో" అంది వనజ.
అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు తన్మయి.
కాస్త చికాకుగా ముఖం పెట్టి "నువ్వెప్పుడూ ఇంతే వనా, హాయిగా నాలుగు నిమిషాలు ఉండనివ్వకుండా, సీరియస్ టాపిక్స్ మొదలెడతావు" అంది.
"పెళ్లంటే గాలిలో తేలడం మాత్రమే కాదమ్మడూ, అసలు విషయం పెళ్లయ్యాక గానీ అర్థం కాదులే" అంది వనజ.
"ఇలా లక్ష ఆలోచిస్తావు కాబట్టే, నీకింకా పెళ్ళి కాలేదు" అని చప్పున నాలుక కరుచుకుని "సోరీ, సోరీ " అంది నిశ్శబ్దమై పోయి, కిందికి చూస్తున్న వనజ ముఖాన్ని పైకి ఎత్తుతూ.
"లేదులే, ఏమో ఎందుకు కాలేదో ఎవరికి తెలుసు? నీకు తెలుసనుకున్నాను." అంది వనజ అంతలోనే తేలికగా నవ్వుతూ.
"నువ్వేమీ అనుకోలేదు కదా, ప్రామిస్" అంది తన్మయి మళ్లీ.
"అందుకే నువ్వంటే నాకిష్టం వనా, నీ స్నేహం లేకపోతే నాకివన్నీ ఎవరు చెప్తారు చెప్పు?"  అంటూ
ఆకాశం లోకి చూస్తూ "అదిగో, సంధ్య వేళ చందమామతో పాటూ ఉదయిస్తున్న గ్రహమ్మీద ఒట్టు, ఇంకోసారి నిన్ను బాధ పెట్టను" అంది.
"ఇక నీ ఒట్ల దండకం ఆపుతావా?" అని
"శేఖర్ వాళ్ల  నాన్నగారితో బాటూ కోళ్ల ఫారం చూసుకుంటున్నాడని చెప్పేడన్నావు కదా, అంటే నువ్వు పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంలో ఉండాలన్న మాట." అంది వనజ సాలోచనగా.
తల నిలువుగా, అడ్డంగా ఆడించి "అవుననుకుంటా...కానీ మధ్య వ్యాపారంలో నష్టం వస్తూందని అతన్ని వైజాగులో ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని వాళ్ల తాతగారింటికి పంపించేరట. బహుశా: అదేమైనా సక్సెస్ అయితే నేను కన్న కలలన్నీ ఫలించినట్లే. ఇంచక్కా ఆకాశాన్ని తాకే సముద్ర తీరంలో ఎగిసి పడే కెరటాల అందాలని ఆస్వాదిస్తూ  జీవితాన్ని గడిపెయ్యొచ్చు. ఏవంటావ్?" అంది తన్మయి గాలిలోకి ఆశావహంగా చూస్తూ.
"నీ కళ్లలోని ఆత్మవిశ్వాసం చూస్తే ఇవన్నీ నిజం అయితే బావుణ్నని అనిపిస్తూంది. అయినా నువ్వు కాస్త కలల్లో బతకడం తగ్గించాలి." అంది వనజ నవ్వుతూ ముక్కు పట్టుకుని ఊపి.
ఇంకో విషయం. నేను ఇంచక్కా అడ్డూ అదుపూ లేకుండా డైరక్టుగా యూనివర్శిటీలో చేరి ఎమ్మే, పీహెచ్ డీ చెయ్యొచ్చు" అంది రెట్టించిన ఉత్సాహంతో తన్మయి.
ఇంతలో కింది నించి జ్యోతి గట్టిగా అరిచింది "తన్మయీ, ఒకసారి కిందికి వస్తావా" అంటూ.

*****