రచయిత్రి పరిచయం



తూ.గో.జిల్లా  జగ్గంపేటలో జన్మించిన  డా|| కె.గీతా మాధవి "కె.గీత" పేరుతో కవయిత్రిగా రచనా ప్రపంచానికి గత ముప్ఫైయ్యేళ్లుగా చిరపరిచితురాలు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి  కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి.  భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు,  తెలుగులో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006  లో "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు " పొందారు. 

అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, అయిదేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఫీల్డు లో మేనేజర్ గాను, గూగుల్ లో  తెలుగు భాషా నిపుణురాలిగాను  పనిచేసి ప్రస్తుతం ఏపిల్ లో " కంప్యూటేషనల్ లింగ్విస్ట్ " పనిచేస్తున్నారు. 

ద్రవభాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి ప్రచురింప  బడ్డాయి.  

కవిత్వంలో అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం ఆవార్డు, రంజనీ కుందుర్తి,  దేవులపల్లి మొ.న అవార్డు లు పొందారు. 

రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు.  సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై దేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. 

అనేక కవితలు, కథలు, వ్యాసాలు, పాటలతో బాటూ  'గీతా కాలం' శీర్షికన ఆంధ్ర భూమి లో కాలమ్ , "అనగనగా అమెరికా" శీర్షికన ఆంధ్ర ప్రభ లో  కాలమ్,   వాకిలి పత్రికలో "సిలికాన్ లోయ సాక్షిగా" ధారావాహిక కథలు రాసారు. గత ఆరేళ్లుగా "నా కళ్లతో అమెరికా " శీర్షికన విహంగ పత్రికలో నెల నెలా ట్రావెలాగ్స్, నాలుగేళ్లుగా కౌముదిలో "వెనుతిరగని వెన్నెల" ధారావాహిక నవల రాస్తున్నారు. 

కాలిఫోర్నియా లోని "బాటా" తెలుగు బడి  "పాఠశాల" కి   కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.  

లలిత సంగీతం లో మంచి ప్రవేశం తో బాటూ అనేక బహుమతులు అందుకున్నారు. 

2017 లో  "బట్టర్ ఫ్లైస్"  సినిమా తో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు.


"వీక్షణం" సాహితీ సంస్థ, "తెలుగు రచయిత" రచయితల వెబ్సైటు, గాటా - GATA(Gobal Association of Telugu Authors) సంస్థాపక అధ్యక్షులు, నిర్వాహకులు. విహంగ వెబ్ పత్రికకు సహ సారధ్యం వహిస్తున్నారు. 
*****